టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత.. కాంగ్రెస్ లో లేని సఖ్యత.. తమకు లాభిస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఈసారి తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగురుతుందని ధీమాగా ఉంది. రాష్ట్ర నేతల్లో ఉన్న ఆ ధీమాకు మరింత ధైర్యం చెప్పారు గోవా సీఎం ప్రమోద్ సావంత్.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సావంత్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే వంద శాతం కోవిడ్ వాక్సిన్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా గోవా నిలిచిందన్నారు. తమ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు.
డబుల్ ఇంజన్ సర్కార్ ఫలాలు గోవాలో అందుతున్నాయన్న సావంత్.. తెలంగాణ లో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. గోవాలో వితంతు పెన్షన్ ఇస్తున్నామని.. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం కూడా ఉందని చెప్పారు. ప్రతీ పేదింటి ఆడ పిల్లకు పెళ్లి సమయంలో లక్ష రూపాయలు ఇస్తున్నామన్నారు. అలాగే అన్నదాతలు, పాడి రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కేంద్ర నాయకులను తీసుకొచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ పై అవగాహన కల్పిస్తున్నారు. మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో బహిరంగ సభ నిర్వహించగా.. 14న హోంమంత్రి అమిత్ షాతో భారీ సభకు ప్లాన్ చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే జరిగే లాభాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నేతలు.