గోవా అసెంబ్లీ ఎన్ని్కలు సోమవారం జరగనున్నాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించాయి.
ఈ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన 301 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే ఉండనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరో వైపు రెబెల్ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు.
ప్రధానంగా అందరి దృష్టి పానాజీ అసెంబ్లీ స్థానంపై ఉంది. ఈ స్థానం నుంచి గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కుమారుడు ఉత్పల్ పారీకర్ టికెట్ ఆశించారు. కానీ బీజేపీ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పానాజీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
ఇక ఎన్నికలకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అందరిలో టెన్షన్ మొదలైంది.
ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థుల విజయాలపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీ చేపట్టిన అభివృద్ది పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీలు చెబుతుండగా, ప్రజలు తమ మెనిఫెస్టోను విశ్వసించారని ఎన్నికల్లో తమకే పట్టం కడతారని ఇతర పార్టీలు చెబుతున్నాయి.