ప్రమాదం జరిగిన బోటులో మొత్తం 73 మంది ఉన్నారని అధికారులు తేల్చారు. దుర్ఘటనలో 39 మంది గల్లంతయ్యారు. గోదావరిలో ఇప్పటివరకు 8 మంది మృతదేహాలు వెలికితీశారు. బోటు ప్రమాదం నుంచి 26 మంది బయటపడ్డారు. బయటపడినవారిలో 21 మంది పర్యాటకులు, ఐదుగురు బోటు సిబ్బంది ఉన్నారు. ఇందులో 26 మందిని తూటుకుంట, కచ్చులూరు వాసులు కాపాడారు. అందరూ బోటుపై ఒకేవైపు చేరటంతో ప్రమాదం జరిగినట్టు బాధితులు చెబుతున్నారు. గల్లంతైన వారు కొట్టుకుపోకుండా ధవళేశ్వరం గేట్లను కిందకు దించారు.
రాజమహేంద్రి : గోదావరిలో పడవ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై ఇంకా కొంత గందరగోళం వుంది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 62 మంది వున్నారని లెక్కలు చెప్పారు. కాదు, ప్రమాద సమయంలో పడవలో 73 మంది ఉన్నారని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 8 మృతదేహాలు వెలికి తీశామని, 26 మందిని సురక్షితంగా కాపాడామని తెలిపారు. మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ప్రమాద సమాచారం అందించడానికి అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. సహాయచర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం అందించడానికి టోల్‌ఫ్రీ నంబర్-1800-233-1077 ఏర్పాటుచేశారు. సమాచారం కావలసిన వాళ్లు ఈ నంబర్‌కు చేయవచ్చునని కలెక్టర్ ముత్యాల రాజు చెప్పారు. గండిపోచమ్మ ఆలయానికి చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.