ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద నీరు పోటెత్తుతూనే ఉంది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం కొనసాగుతోంది. గంటగంటకూ వరదనీరు భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 67.50 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం 22.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు అధికారులు.
వరద ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు. భద్రాచలం పట్టణానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను నిలిపివేశారు అధికారులు. భద్రాచలం పట్టణాన్ని నాలుగువైపులా వరద ప్రవాహం చుట్టుముట్టింది. మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 37 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
అయితే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతోంది. ఇన్ ఫ్లో 1,45,216 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,08,570 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1087.70 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. వరదల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పెద్దపల్లిజిల్లా మంథనికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. పట్టణం మీదుగా బయటకి రాకపోకలు ప్రారంభం అయ్యాయి. వరద ప్రవాహం తర్వాత ఇక్కడ భారీగా నష్టం జరిగినట్లు కనిపిస్తోంది. వ్యాపార సముదాయాలు, ఇళ్లకు నష్టం వాటిల్లింది.
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకు 62.71 అడుగుల వరకు చేరుకుంది వరద ప్రవాహం. జిల్లాలో వర్షాల కారణంగా 38 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 52 పునరావాస కేంద్రాల్లో 4,766 మంది ఆశ్రయం పొందుతున్నారు. అలాగే.. జిల్లాలో 25 ఇళ్లు నేలమట్టం కాగా.. 393 ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి.