రాజమహేంద్రవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద 51 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజివద్ద ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు. 13లక్షల 22వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఈసారి 16 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం ప్రధాన రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు వరదబారిన పడ్డాయి. గంట గంటకు ఉధృతి పెరగడంతో పంట పొలాలు, అరటి తోటలు నీటమునిగాయి. వరద ప్రవాహానికి మన్యంలో గ్రామాలు నీట మునగడంతో గిరిజనులు బిక్కు బిక్కుమంటున్నారు. పరిస్థితి దారుణంగా ఉంటే అధికారులు సహాయక చర్యలు అందించడంలో విఫలమయ్యారని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోనసీమ లంకల్లోకి వరద ప్రవేశించింది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద 27.80 మీటర్ల మేర వరద చేరింది. స్పిల్వే వద్ద 27.50 మీటర్లు. కొత్తూరు కాజ్‌వేపై 10 అడుగుల చొప్పున నీటి ప్రవాహం ఉంది. మరోవైపు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోకి వరదనీరు చేరడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. పత్తి, మిరప పంటలు ముంపునకు గురయ్యాయి. వరద దృష్ట్యా మండల ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.