గోదావరి ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సమీపంలో పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి.
దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ట్రైన్ తక్కువ స్పీడ్ లో ఉండడంతో పాటు సకాలంలో డ్రైవర్ తీసుకున్న జాగ్రత్తల కారణంగా మిగతా బోగీలు పట్టాలపైనే ఉండడంతో పాటు పట్టాల నుంచి పక్కకు జరిగిన నాలుగు బోగీలు కూడా సేఫ్ గానే ఉన్నాయి. దీంతో ప్రమాదమేమీ లేదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో కాజీపేట-సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణహాని, గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
ఎస్-1, ఎస్-4, జీఎస్, ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేశామని.. అదే రైలులో ప్రయాణికులను పంపిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. మొత్తానికి గోదావరి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.