భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటిమట్టం 70 అడుగులకు చేరింది.గోదావరి ఈ స్థాయికి చేరడం ఇది మూడోసారి.1986లో గోదావరి భద్రాచలం వద్ద 75.6 అడుగులకు చేరింది.1990లో భద్రాచలం వద్ద 70 అడుగులకు చేరగా..తాజాగా ప్రస్తుతం మరోసారి 70 అడుగులకు చేరింది.ఎగువన కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో వరద పోటెత్తింది.
భద్రాచలం వద్ద బ్రిడ్జి పై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేయనున్నారు.నదికి వరద పోటెత్తితే పట్టణంలోకి వరద నీరుచేరకుండా ఉండేందుకు గాను ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో రామాలయానికి ఉత్తర భాగంలో కరకట్టను నిర్మించారు.ఈ కరకట్ట ప్రస్తుతానికి భద్రాచలం పట్టణానికి రక్షణగా నిలిచింది.
గతంలో 66 అడుగుల మేర వరద నీటిని ఈ కరకట్ట అడ్డుకొంది. అయితే ప్రస్తుతం 70 అడుగుల మేర నీరు వచ్చింది.దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం నుండి ఛత్తీస్ ఘడ్, ఏపీ,తెలంగాణ వైపు వచ్చే మార్గాలన్నీనీటితో నిండిపోయాయి. రాకపోకలు సాగించే వీలు లేకుండా పోయింది. భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తడంతో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గాను ఐఎఎస్ అధికారి శ్రీధర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో వైపు 101 మందితో కూడా ఆర్మీ బృందాన్నికూడా భద్రాచలానికి పంపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని ప్రభుత్వం కోరింది.68 మంది సభ్యులుగల ఇంఫ్రాన్ట్రీ, 10 మంది సభ్యులుగల వైద్య బృందం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వీరితో పాటు 23 మంది సభ్యులుగల ఇంజనీరింగ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటుంది. మొత్తం ఐదు బృందాలుగా ఉన్నఈ సైనిక బృందంలో నలుగురు అధికారులు,ఐదుగురు జేసీఓ లు, 92 వివిధ ర్యాంకుల సభ్యులుంటారు.
జులై మొదటి పక్షంలోనే ఈ స్థాయిలో వరదపోటెత్తడం గోదావరి చరిత్రలోనే ఇది రెండోసారి.1976లో తొలిసారి భద్రాచలం వద్ద 63.9 అడుగుల నీటిమట్టం జూన్ 22న నమోదైంది.ఆ తర్వాత 36 ఏళ్లలో 70 అడుగులు దాటడం ఇదే ప్రథమం.
భద్రాచలం వద్ద గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.ప్రస్తుతం గోదావరి నీటిమట్టం శుక్రవారం 70.10 అడుగుల వద్ద కొనసాగుతుంది.75 అడుగులు దాటితే.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్ అవుతుంది.ఇప్పటివరకు ఆరుసార్లు 60 అడుగులు,రెండుసార్లు 70 అడుగులు క్రాస్ అయింది.ఎగువ నుంచి గోదావరిలోకి 23.82 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.