ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక
భయంభయంగా కోనసీమ లంక గ్రామాలు
దిగ్బంధంలో ఏజెన్సీ ప్రాంతాలు
రాజమహేంద్రవరం: గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. బ్యారేజ్ దగ్గర నీటి మట్టం బాగా పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర ప్రస్తుత నీటిమట్టం 14.10 అడుగులకు చేరుకోవడంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తివేసి, దిగువకు 13 లక్షల 22 వేల 245 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
గంట గంటకు వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుండటంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు భయాందోళనతో వున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల ప్రజలు దిక్కుతోచక నది వైపు చూస్తూ గడుపుతున్నారు. తూర్పు ఏజెన్సీలోని విలీన మండలాలు, దేవీపట్నం మండలానికి సంబంధించిన పలు గ్రామాలు జల దిగ్బంధంలో వున్నాయి. గోదావరి ఉప నదులు గౌతమి, వైనతేయ, వశిష్ట నదులు పోటెత్తడంతో కోనసీమలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో వున్నాయి. కోనసీమలో పలు లంక గ్రామాలలో వరద నీరు చేరింది.