- మృతదేహాన్ని ఇలాగే ఇస్తారా?
- భద్రపరిచే పద్ధతి ఇలాగేనా?
- పురుగులు పట్టినా మీకు పట్టదా?
- ఆక్రోశించిన ‘బోటు’ బాధితుడు
- అధికారుల నిర్లక్ష్యానికి నిరసన
- ఆస్పత్రి దగ్గరే ఆత్మహత్యాయత్నం
- మరో ఆరు మృతదేహాలు లభ్యం
- ఇంకా తెలీని 13మంది ఆచూకీ
- నాలుగు రోజుల్లో 34 గుర్తింపు
అసలే ఆప్తులను కోల్పోయిన ఆవేదన! ఆఖరి చూపుకైనా దక్కుతుందో లేదోనని ఆతృత నిండిన గుండెలతో వెతుకులాట! అలాంటి ఒక గుండె తన బంధువు మృతదేహం కనిపించిన తీరుకు బద్దలయింది. మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉండాల్సిన మృతదేహాన్ని అక్కడ ఇనుప టేబుల్‌పై చూసుకొని ఆ గుండె భగ్గుమంది. దేహమంతా పురుగులు లుకలుకలుండటం చూసి కదిలిపోయింది. ఆ ఆవేదనతో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ ఆస్పత్రి ప్రాంగణంలోని క్యాంటీన్ దగ్గర డ్రింక్‌సీసాతో తలపై కొట్టుకుని పొట్టలో పొడుచుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు అప్రమత్తమై రక్షించారు.
రాజమహేంద్రవరం: గోదావరిలో బోటు మునిగిన విషాదంలో గల్లంతయిన వారి మృతదేహాలను వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చి భద్రపరుస్తున్న తీరును ఈ ఘటన ప్రశ్నార్థకం చేస్తోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని సికింద్రాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన ప్రసాద్‌గా గుర్తించారు. తన మేనల్లుడు పవన్‌కుమార్ (58), అతడి భార్య వసుంధర భవాని (45), వారి కుమారుడు గోకుల్ సుశీల్ (25) పాపికొండలు విహారానికి వెళ్లి గల్లంతయ్యారు. వారిలో ప్రసాద్ మేనకోడలు వసుంధర భవాని మృతదేహం మాత్రమే ఇప్పటిదాకా వెలికివచ్చింది. మార్చురీలో ఆమె మృతదేహాన్ని భద్రపరిచిన తీరుతో కలత చెంది ప్రసాద్ బలవన్మరణానికి ప్రయత్నించాడు. ‘పురుగులు పట్టినా పట్టించుకోరా.. మావాళ్ల మృతదేహాలను ఇలాగే అప్పగిస్తారా’ అన్న ప్రసాద్ ఆవేదన చెంది ప్రశ్నించిన తీరు అక్కడ ఉన్న వారందరినీ కలచివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం మరో ఆరు మృతదేహాలను నదిలో గుర్తించి, బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో వశిష్ఠ బోటులో 73 మంది పర్యాటకులు ఉన్నారు. సురక్షితంగా బయటపడినవారిని, ఇప్పటిదాకా వెలికివచ్చిన మృతదేహాలను బట్టి.. ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన రోజు నుంచి బుధవారం వరకు 34 మృతదేహాలను గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, వశిష్ఠ పున్నమి రాయల్ ప్రైవేట్ టూరిజం బోటు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.45 గంటలకు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారిలో 24 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు కనుగొన్న మృతదేహాలలో 23 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలవి ఉన్నాయి. మిగిలిన వారి కోసం ఇంకా విస్తృతంగా గాలిస్తున్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్హహణ శాఖ తెలిపింది. మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. విచారణ జరిపి 60 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని జేసీని కోరింది.