గతంలో ఎన్నడూ లేనంతగా జులైలో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణపై రుతుపవనాల గాలులు వేగంగా కదులుతుండటంతో పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. నదికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఇప్పటికే గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదకు తోడు.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో గోదారి ఉద్ధృతంగా కొనసాగుతోంది. దాదాపుగా అన్ని ప్రాజెక్టుల గేట్ల నుంచి ప్రవాహం పరుగులు పెడుతోంది. శ్రీరామ్ సాగర్ 34గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం జలాశయానికి పరిమితికి మించి ప్రవాహం పోటెత్తుతోంది.
బుధవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, దాని ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల వద్ద గోదావరి వెనక్కి తన్ని మంచిర్యాల, మంథని లాంటి పట్టణాలు, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా గోదావరిఖని – మంచిర్యాల మధ్య ఉన్న గోదావరి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు మూడు చోట్ల గండిపడింది. మైసమ్మ గుడి, ఎడమ కాలువ, పవర్ హౌస్ వద్ద గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు చేరి వందలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కడెం ప్రాజెక్టు తెగిపోయినట్టుగా ప్రసారం అవుతున్న వీడియోలు వాస్తవం కాదని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. డ్యాం బ్రేక్ అయినట్టు ఇంజనీర్ల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు.
భద్రాద్రి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు భారీగా చేరింది. గత ఏడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కొత్తగూడెం సింగరేణి ఉపరితల బొగ్గు గని జీకెఓసీలోకి వరద నీరు చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఏడు రోజులుగా సుమారు 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
గోదావరి వరద ఉద్ధృతితో దేవాదుల పనులకు ఆటంకం వాటిల్లింది. ఎత్తిపోతల పథకం ఫేజ్ -3లోని ప్యాకేజ్ -3 పనులకు అంతరాయం ఏర్పడింది. టన్నెల్, సర్జ్ పూల్ లను వరద ముంచెత్తింది. భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లిపేరు, స్వర్ణ, గడ్డెన్నవాగు, వైరా వట్టివాగు ఇతర జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారాయి.