గోదారమ్మ మైలపడింది, శుద్ధి చేయాలంటున్నారు కచ్చులూరు చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజనులు. వారి ఆచారాల ప్రకారం గోదావరి శుద్ధి జరిగే వారకు పచ్చి గంగ కూడా ముట్టరు. 10, 12 గ్రామాల్లో ఇదే పరిస్థితి! ఇటు చూస్తే గోదావరిలో మునిగిన బోటును పైకి తేలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. దాని గురించి పట్టించుకునే వాళ్లే అక్కడ లేరు..
ప్రకృతిని ప్రేమించటంలో గిరిజనుల తర్వాతే ఎవరైనా..! చెట్టూ, పుట్టా, జలం అన్నింటినీ మన్యం జనం దైవంగా భావిస్తుంది. ఇప్పుడు కూడా అంతే, గోదావరి నీటిని గిరిజనులు ముట్టడం లేదు. పడవ ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇదే పరిస్థితి. ఎంతో అమితంగా ప్రేమించే గోదారమ్మ నీటిని ముట్టకపోవటం వారికి ఎంతో బాధగానే వున్నా నీటికి వాళ్లు దూరంగానే ఉంటున్నారు.
కచ్చులూరు. ఇప్పుడు ఈ పేరు దేశమంతా వినిపించిన పేరు. మొన్నటి బోటు మునిగిన చోట ఇంకా మృతదేహాల వెలికితీత పూర్తి కాలేదు. ప్రభుత్వం, అధికారులు, స్థానికంగా వుండే గిరిజనులు బోటులో మునిగి చనిపోయిన వారి మృతదేహాలు బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. అయితే… ఒక్కపూట తినకున్నా, ఆచారాలను పాటించడంలో కచ్చితంగా వుండే గిరిజనులు, ప్రస్తుతం గోదావరి నీటిని ముట్టడం లేదు. చివరి మృతదేహాన్ని తీసే వరకు ఆ నీటిని ముట్టమని, మృతదేహాలు అన్ని దొరికాక గోదారమ్మకు శుద్ధి చేసిన తర్వాతే మళ్ళీ ఆ నీటిని ముడతామంటున్నారు. అప్పటి వరకు కొండలపై నుంచి జాలు వారే నీటిని తెచ్చుకుంటామని, కొంత ఇబ్బంది అయినా భరిస్తామని అంటున్నారు వాళ్లు.. మొత్తం 10-12 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం.