గోదావరి వరద ఉధృతి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు పెను శాపంగా మారింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని దేవీపట్నం ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. పోలవరం ఎగువ గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు గ్రామాల్లోకి నీరు వచ్చింది. రెండుసార్లు గ్రామాల్ని పూర్తిగా ముంచెత్తింది. ఇటు ఇదే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకతో పాటు అనేక లంక భూములు నదీ కోతకు గురవుతున్నాయి. రెండు రోజులుగా రూ.కోట్ల విలువైన సిరులు పండే భూములు నదీ గర్బంలో కలిసిపోయి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి.
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాను గోదావరి ముప్పు తిప్పలు పెడుతోంది. ఐదారు రోజులు నుంచి దేవీపట్నం మండలం ముంపులోనే ఉంది. వరదనీటిలో పల్లెలు నానుతున్నాయి. ఆహారం, తాగునీటికి కటకటగా ఉంది. కోనసీమ వాసులనూ వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నీటిపాలైన పంటలను చూసిన రైతులు బోరున విలపిస్తున్నారు.
వరద ముంపుతో సుమారు 30 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పడవల ద్వారా రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను ఎప్పటికి పరిష్కరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తొయ్యేరు, దేవీపట్నం, వీరవరం, పూడిపల్లి, పోశమ్మగండి ప్రాంతాలలో ప్రభుత్వం సహాయ శిబిరాలు ఏర్పాటుచేసినా సౌకర్యాలు అంతగా లేవని ముంపు ప్రాంతాల బాధితులు చెబుతున్నారు. సహాయ సిబ్బంది అందించే ఆహార పొట్లాలు సరిపోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు లేక పిల్లలు అలమటిస్తున్నారు. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారుల నుంచి కనీస స్పందన వుండట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.