తెలంగాణ, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 98,275 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 41వేల క్యూసెక్కులుగా ఉంది. 9 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1088.1 అడుగులుగా ఉంది.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. వరద ప్రవాహంతో నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. స్నానఘట్టాల ప్రాంతం నీట మునిగింది. వంతెన వద్ద ప్రవాహాన్ని, స్నాన ఘట్టాల వద్ద పరిస్థితిని మంత్రి పువ్వాడ పరిశీలించారు.
ఇక సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.6 మీటర్లు కాగా.. 521.588 మీటర్లకు చేరుకుంది. ఇన్ ఫ్లో 5,863 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది. వర్షం కారణంగా సింగరేణి ఉపరితల గనిలో వరదవరద చేరడంతో 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఎల్లంపల్లి జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 13.19 టీఎంసీలకు చేరుకుంది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. మున్నేరు వరద ఉద్ధృతిని కూడా మంత్రి పువ్వాడ పరిశీలించారు. ఆయనతోపాటు కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు ఉన్నారు.