వరంగల్ వేణుగోపాల స్వామి గుడిలో గోదా దేవి కళ్లు తెరిచిందన్న వార్త క్షణాల్లో దావానలంలా వ్యాప్తించింది. దీంతో స్థానిక భక్తులంతా ఆ వింతను చూడటానికి ఆలయానికి పోటెత్తారు. సాధారణంగా హిందువుల్లో ఎక్కువ మంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు. వారి నమ్మకాలను ఇలాంటి ఘటనలు నిజమే అనేలా చేస్తున్నాయి.
ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం.. విగ్రహం పాలు తాగడం.. రాముడు కన్నీరు కార్చడం.. ఆంజనేయుడు కళ్లు తెరవడం.. కొబ్బరికాయ వినాయకుడి రూపంలో ఉండడం.. శివుడికి పాము పూజ చేయడం ఇలా నిత్యం వీటి గురించిన వింతలు వింటూనే ఉన్నాం. కానీ దీనికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. వింత ఘటనలు అలా వింతగానే మిగిలిపోతున్నాయి.
తాజాగా వరంగల్ లో అలాంటి అద్భుతమే జరిగిందని భక్తులు చెబుతున్నారు. గుడిలో ఉన్నట్టుండి అమ్మవారు కళ్లు తెరిచి చూసిందని.. భక్తులు ఉప్పొంగిపోతున్నారు. వరంగల్ నగరంలో శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైందని చెబుతున్నారు. గోదాదేవి అమ్మవారు కళ్లు తెరిచి చూసిందని ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అమ్మవారు కుడి కన్ను తెరిచిందనే ప్రచారం ఆనోటా ఈనోటా పాకడంతో ఈ వింతను చూసేందుకు భక్త జనం బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కళ్ళు తెరిచిన అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన ఓ భక్తురాలికి పూనకం రావడంతో స్థానికుల్లో భక్తి భావం ఉప్పొంగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్ వైరల్ అవుతోంది.