విడుదలైన మొదటి రోజు నుంచి గాడ్ ఫాదర్ వసూళ్లపై గందరగోళం ఉంది. గాడ్ ఫాదర్ కు మొదటి రోజు 26 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తే, యూనిట్ మాత్రం వరల్డ్ వైడ్ 38 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించుకుంది. ఆ తర్వాత 3 రోజులకే వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చెప్పుకొచ్చింది.
ఇలా మొదటి రోజు నుంచి వసూళ్లపై గందరగోళం ఉంది. దీన్ని మరింత కొనసాగిస్తూ, ఈరోజు రెండు స్టేట్ మెంట్స్ ఇచ్చారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. వీటిలో ఒకటి గాడ్ ఫాదర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పడం. షేర్ లెక్కలు పక్కనపెట్టి, గ్రాస్ లెక్కల్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల నుంచి 60 కోట్ల రూపాయల వసూళ్లు లేవు. కానీ నిర్మాత మాత్రం రౌండ్ ఫిగర్ ప్రకటించేశారు.
ఇక నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇచ్చిన మరో షాకింగ్ స్టేట్ మెంట్, ఓన్ రిలీజ్. అవును.. గాడ్ ఫాదర్ సినిమాను ఎవ్వరికీ అమ్మలేదని ప్రకటించుకున్నారు నిర్మాత. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను తాము సొంతంగా అడ్వాన్సుల ప్రాతిపదికను రిలీజ్ చేశామని అన్నారు. ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం ద్వారా, బయట వినిపిస్తున్న నంబర్లలో ఎలాంటి వాస్తవం లేదని పరోక్షంగా వెల్లడించారు నిర్మాత. అంతేకాదు, ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా తప్పని చెప్పినట్టయింది.
మొత్తానికి నిర్మాతల ప్రకటనతో గాడ్ ఫాదర్ లెక్కలన్నీ మారిపోయాయి. విడుదలకు ముందు గాడ్ ఫాదర్ వసూళ్లను బయటపెట్టమని, అధికారికంగా ప్రకటించమని చెప్పారు చిరంజీవి. కానీ మొదటి రోజు నుంచే పోస్టర్లు వచ్చేశాయి. ఇప్పుడిలా సరికొత్త నంబర్లతో మరింత గందరగోళానికి గురిచేస్తోంది యూనిట్.