గోధ్రా ఘటనకు సంబంధించి 11 మంది దోషులకుమరణశిక్ష విధించాల్సిందేనని గుజరాత్ ప్రభుత్వం ..సుప్రీంకోర్టుకు తెలిపింది. 2002 లో జరిగిన ఈ సంఘటనను అత్యంత అరుదైనదిగా పేర్కొంది. టాడా లోని వివిధ సెక్షన్ల కింద వీరిపై అభియోగాలు ఉన్నాయని, అందువల్ల ప్రభుత్వ పాలసీ మేరకు వీరిని ముందుగా జైలు నుంచి రిలీజ్ చేయరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని వీరు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది.
ఈ కేసు తీవ్రతను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. నాడు ఆ ఘటనలో గోద్రా రైల్లో 59 మంది సజీవదహనమయ్యారని, బయటి నుంచి బోగీని లాక్ చేసేశారని, మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన వివరించారు. ముఖ్యంగా నలుగురి పాత్ర కీలకమైనదన్నారు.
ఈ కేసులో 11 మంది నిందితుల మరణ శిక్షను 2017 లో గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2011 లో 31 మంది నిందితులను దోషులుగా ట్రయల్ కోర్టు ప్రకటించింది. 63 మందిని నిర్దోషులుగా విడిచి పుచ్చింది. 31 మంది దోషుల్లో 11 మందికి మరణ శిక్ష విధించాలని తీర్పునిచ్చింది. .
అయితే 2017 లో హైకోర్టు వీటిని యావజ్జీవ ఖైదుగా మార్చిన విషయాన్ని మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ దోషులు 2018 లో కోర్టును అభ్యర్థించారు. ఈకేసును సోమవారం పరిశీలించిన కోర్టు.. మూడు వారాల తరువాత దీన్ని లిస్ట్ లో పెట్టాలని ఆదేశించింది . విచారణకు ముందు ఈ దోషుల వివరాలనన్నింటినీ డాక్యుమెంట్లతో సహా సమర్పించాలని కూడా సూచించింది.