‘ గాడ్సే నాకు ఆదర్శం’ అనే అంశంపై ఓ విద్యాసంస్థలో యువ వికాస్ అధికారులు ఉపన్యాస పోటీలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందడంతో సదరు విద్యా సంస్థపై చర్యలకు దిగారు. డీఈఓ బరయ్య వివరాల ప్రకారం..
గుజరాత్ లో వల్సాద్ లోని ఓ ప్రైవేట్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న కుసుమ్ విద్యాలయాలో ఫిబ్రవరి14న ఉపన్యాస పోటీలను జిల్లా యువ వికాస్ విభాగం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
ఇందులో ‘ గాడ్సే నాకు ఆదర్శం” అనే అంశంపై మాట్లాడాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో యూత్ డెవలప్ మెంట్ అధికారి నీతాబెన్ గావ్లేపై ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ విషయానికి సంబంధించి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ‘ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు అధికారిని సస్పెండ్ చేశాము. ఈ విషయంలో సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తున్నాము. అసలు ఆ అంశాన్ని ఎవరు సెలెక్ట్ చేశారు, దానికి గల కారణాలపై తెలుసుకుంటున్నాము” అని జిల్లా కలెక్టర్ క్షిప్రా ఆగ్రే అన్నారు.