గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు శేషన్న కస్టడీ పూర్తైంది. అతన్ని సోమవారం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు శేషనన్ను పోలీసులు విచారించారు. శేషన్న కస్టడీని పోలీసులు రహస్యంగా ఉంచారు. కస్టడీ పూర్తి కావడంతో నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. పోలీసులు శేషన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు.
నయీం అక్రమాలలో శేషన్న పాత్ర ఎలాంటిది? శేషన్న అధీనంలోని యాక్టన్ టీం ఎక్కడ? ఎంతమంది? అని విచారించనున్నారు పోలీసులు. అలాగే నయీంకు ఏకే 47 గన్ ఎలా వచ్చిందో శేషన్నకు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శేషన్న రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా ఐపీఎస్ వ్యాస్, కొనపురి రాములు, పటోళ్ల గోవర్థన్ రెడ్డి, శ్రీనివాస్ రావు, శ్రీధర్ రెడ్డి, కనకాచారి టీచర్, రాములు హత్య కేసులో ప్రధాన నిందితుడు శేషన్న.
అసలు ఈ శేషన్న ఎవరంటే.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన శేషన్న పదో తరగతి చదువుతుండగానే నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు. 1993లో సనత్‌నగర్ ఠాణా పరిధిలో టాడా కేసులో అరెస్టయ్యాడు. అనంతరం మాజీ ఐపీఎస్ కేఎస్ వ్యాస్ హత్య కేసులో పీటీవారెంట్‌పై పోలీసులు ఆయనను జైలుకు పంపగా.. అక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీంతో శేషన్నకు అనుబంధం పెరిగింది.
బెయిల్‌పై బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి పెద్దఎత్తున దందాలు చేశారు. అచ్చంపేటలో 2004లో రాములు, ఉట్కూర్‌లో 2005లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకాచారి, హైదరాబాద్ సుల్తాన్‌బజార్ ఠాణా పరిధిలో 2011లో మాజీ నక్సలైట్ పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో శ్రీనివాస్‌రావు, 2014లో నల్గొండ పట్టణంలో కోనాపురం రాములు హత్య కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు.
ఈ హత్యలు చాలావరకు నయీం ప్రోద్బలంతోనే జరిగాయి. ఆయుధ చట్టం కింద శేషన్నపై మరో 3 కేసులు నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్ హుమాయూన్‌నగర్‌కు చెందిన ఓ మాజీ రౌడీషీటర్‌ను బెదిరించాలంటూ శేషన్న అదే ప్రాంతంలోని ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన అబ్దుల్లాకు తుపాకీ ఇచ్చాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అబ్దుల్లా ఇంట్లో సోదా చేసి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శేషన్న కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్ చేశారు పోలీసులు.