ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్నాయి కూడా. అలాంటి ఎంతో విలువైన బంగారం.. ఉచితంగా దొరికితే ఎవరైనా వదలిపెడతారా? అందిన కాడికీ ఎత్తుకెళ్తారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోనిపార్కండి గ్రామంలో ఉన్న ఓ నదిలో బంగారం దొరుకుతోంది. గ్రామస్తులంతా ఎగబడి మరీ తీసుకెళ్తున్నారట. అసలేం జరిగిందంటే..?
పార్కండి గ్రామం మీదుగా బన్‌స్లోయి నది ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఈ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎండాకాలంలో నీరు ఎక్కువగా ఉండదు. ప్రస్తతుం కూడా నీరు తక్కువగా ఉంది. ఐతే ఈ నదిలోని ఇసుకలో బంగారం దొరుకుతోందన్న వార్త దావానలంగా వ్యాపించింది. కొందరు వ్యక్తులకు బంగారం దొరికిందన్న ప్రచారం జరగడంతో.. అందరూ నది ఒడ్డుకు వెళ్లి.. ఇసుకను తవ్వుతున్నారు.
అలా తవ్విన వారిలో కూడా కొందరికి బంగారం దొరికిందట. ఝార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం నది ఒడ్డు నుండి బంగారు దొరికాయట. బన్‌స్లోయి నది ఒడ్డున బంగారం మొదట ఈయనకే దొరికిందట. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలియడంతో.. గ్రామస్తులంతా నది వద్దకు చేరుకొని.. బంగారం కోసం వెతుకుతున్నారు.
బంగారు నాణేలు వంటి పలు గుండ్రటి వస్తువులు లభించినట్లు స్థానిక వర్గాల ద్వారా తెలిసింది. బన్‌స్లోయ్ నది ఒడ్డున బంగారు రేణువులను కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి నెలా కనీసం 60-80 బంగారు రేణువులను వెలికితీస్తారని నిపుణులు చెబుతున్నారు.