విజయవాడ: ఇదే మంచి చౌక బేరమూ…! భలే…భలే..బంగారమూ..! మహిళలారా…! మంచి తరుణమూ…! మించినన్ …దొరకదు…! అంటూ ఇప్పుడు పసిడి మార్కెట్ మురిపిస్తోంది. నిన్నమొన్నటి దాకా 40వేలకు చేరిన బంగారం కాస్త చవకై కొనుగోలుదారులను ఊరిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లోనే బంగారం ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం కొంచెం అప్ ట్రెండ్ ఉంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 1,529 డాలర్ల సమీపంలో పడిపోయింది. ఢిల్లీ మార్కెట్‌లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.38,900కు పతనమైంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గి రూ.37,700కు చేరింది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.48,500 వద్దనే స్థిరంగా ఉంది.
హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధర మళ్లీ స్వల్పంగా పైరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరుగుదలతో రూ.40,260కు చేరింది.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.20 పెరుగుదలతో రూ.36,910కు చేరింది. కేజీ వెండి ధర రూ.48,500 వద్దనే ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.50 శాతం తగ్గుదలతో 1,529.15 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.84 శాతం పెరుగుదలతో 18.47 డాలర్లకు ఎగసింది. బంగారం కదా మరి…అటు…ఇటు.. ధరల దోబూచులాటతో మురిపిస్తోంది.