దేశంలో బంగారు ధరలకు రెక్కలొచ్చాయ్. అయితే చిత్రంగా గోల్డ్ కొనుగోళ్ల గ్రాఫ్ కూడా అదే రేంజులో రైయ్ మంటోంది. తులం బంగారం రేటు విని కళ్లు తేలేసే మధ్య తరగతి మహానుభావుడు ఇంత కాస్ట్ పెట్టి కొనగలడా. చచ్చినా కొనలేడు..కొంటే చస్తాడు.!
మరి ఎవరు కొంటున్నారబ్బా..!? ఇంకెవరు డబ్బున్నోళ్ళు..! సాధారణంగా ధరలు తగ్గినప్పుడు కదా భారీగా కొంటారు.! ఇంత డబ్బెందుకు పెట్టి కొంటారు..! ఇదీ పాయింటే..!? ఏమై ఉంటుంది అంటారు.?! మీకు ఈ పాటికే బల్బు వెలిగి ఉండాలి.
వెలిగిందండోయ్…! మోడీ గవర్నమెంట్ రెండువేల నోట్లు రద్దుచేసింది కదా మరి…! అదీ లెక్క..! మీ బుర్ర భూ చక్రంలా పనిచేసిందండి.కొన్నాళ్లుగా చూద్దామంటే మార్కెట్లో కనపడని రెండు వేల నోటు గొప్పోళ్లు గోదాముల్లో దాక్కొని దాక్కొని ఇప్పుడు బంగారం కొట్టుకు వెళ్లబోతోంది.
అక్కడనుంచి గొప్పోళ్లింటికి గోల్డ్ గా రాబోతోంది..! అదా సంగతీ.! అందరినీ ఆ గాటిన కట్టేయలేం లెండి..! నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద లైన్లు కట్టడం ఈ గొడవంతా ఎందుకనుకుంటారు. ఎప్పటికీ డిమాండ్ ఉండే పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు.
ఇదీ పాయింటే..! ఏదైతేనేం గోల్డ్ ని ఆకాశానికి ఎత్తేసారుగా.! రెండు వేల నోట్లరద్దు పుణ్యమా అని బ్యాంకులు ఏటీఎమ్ ల దగ్గర ఉండే రద్దీ బంగారు దుకాణాల దగ్గర పెరిగింది.అయితే బ్యాంకులకు బదులు బంగారం కొట్లు బిజీ అయ్యాయన్న మాట.
ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లోని బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయట. ముంబైలోని (Mumbai) జవేరి బజార్‌లో బంగారం కొనుగోలుదారులు రూ.2 వేల నోట్లు చెల్లిస్తున్నారు. గత వారంతో పోలిస్తే 10 గ్రాములకు రూ.485 మేర బంగారం ధర పెరిగింది. రూపాయి పెరిగినా పెరిగినట్టేగా.!
అయినప్పటికీ రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం కొనుగోళ్లపై పడలేదు. అయితే బంగారం కొనుగోళ్లు పెద్దగా ఏమీ లేవని ఇండియన్ బులియన్, జువెల్లరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు. ఈయనది చాలా పెద్దమనసే అనుకోవాలి.
2016లో పెద్ద నోట్ల రద్దుతో పోలిస్తే కొంతమేరకు రద్దీ తక్కువే ఉన్నట్టు చెప్పారు. అప్పుడు తులం బంగారం ధర రూ.30 వేలు మాత్రమే ఉందని, ప్రస్తుతం అది రూ.60 వేలకు చేరిందన్నారు.ఆరేడు సంవత్సరాలకు రెట్టింపు అయ్యింది మరి.
బంగారం రేట్లు చుక్కలను అంటడంతో డిమాండ్ కాస్తా తగ్గిందని చెప్పారు. అయితే గతవారంతో పోలిస్తే కొనుగోళ్లు రెట్టింపయ్యాయని తెలిపారు. ఇక కోల్‌కతాలో (Kolkata) నగల కొనుగోళ్లు 15-20 శాతం పెరిగాయన్నారు.
2016 నాటి పరిస్థితులు లేవని, బంగారం దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకుంటున్నారని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు అశోక్ బెగాని అన్నారు.
అయితే రూ.50 వేలు అంతకంటే ఎక్కువ లావాదేవీలకు సంబంధించి వినియోగదారులు కేవైసీ సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని వెల్లడించారు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలకు పాన్‌కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని, రూ.10 లక్షల నగదు లావాదేవీలు జరిగినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుందని చెప్పారు.ఇదీ బంగారం కథ.