హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. రూ. కోటి విలువ చేసే 2.1 కేజీల బంగారాన్ని శనివారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ముంజా ప్రసాద్ గౌడ్ అనే దుబాయ్ ప్రయాణికుడు 18 బంగారు బిస్కెట్లను లగేజీ బ్యాగ్‌లో దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు.
లగేజ్ బ్యాగ్ స్కానింగ్ చేసే సమయంలో బంగారం బయట పడింది. బ్యాగులో దొరికిన బంగారాన్ని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం విదేశాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే ఐదున్నర కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి… లో దుస్తుల్లో దాచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు. వీరిపై అనుమానంతో విమానాశ్రయ అధికారులు ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశారు.