స్మగ్లర్లు కష్టమ్స్ వాళ్ళ కన్నా రెండడుగులు ముందే ఉంటారు. ఎప్పటికప్పుడు సిబ్బందికన్నుగప్పి నిషిద్ధ వస్తువుల్ని దేశాలు దాటించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే వినూత్న మార్గాల్లో విలువైన వస్తువులను గమ్యాలకు చేరవేస్తూ ఉంటారు. అయితే అధికారులు అంతకుమించిన ప్రతిభను చూపించి వాళ్ళ గుట్టురట్టు చేస్తారు.
అలాంటి సంఘటనే శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళలను నిఘా విభాగం అధికారులు తనిఖీ చేశారు.
వారు పేస్ట్ రూపంలో బంగారు క్యాప్సూల్స్ తీసుకొస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మలద్వారంలో దాచుకుని తెచ్చినట్లు గుర్తించారు. వారి నుంచి అధికారులు బంగారం క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు.
రూ.1.94 కోట్లు విలువైన 3,175 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ మేరకు వారిపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.