బంగారం స్మగ్లర్లు మితిమీరిపోయారు. సినిమాల ప్రభావమో ఏమోగానీ.. అదే స్టయిల్ లో ప్లాన్స్ చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అధికారులకు తెలియకుండానే కొవిడ్ నిర్ధారణ కేంద్రంలోకి వెళ్లాడు. అనుమానం వచ్చి అతనిపై ప్రత్యేక నిఘా ఉంచారు.
కాసేపటి తర్వాత.. కొవిడ్ నిర్ధారణ కేంద్రంలోకి వెళ్లి పరిశీలించగా లోపల చెత్తబుట్టలో ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. అందులో దాదాపు 6 చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని విప్పి చూడగా.. 2 ప్యాకెట్లలో బిస్కెట్లు, మరో 4 ప్యాకెట్లలో పేస్ట్ రూపంలో ఉన్న కోటి 65 లక్షల విలువైన 3 కిలోల 14 గ్రాముల బంగారం ఉంది.
కొవిడ్ నిర్ధారణ కేంద్రంలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి చెత్త బుట్టలో పడేసిన కవర్ ను విమానాశ్రయం బయట అందించేలా స్మగ్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
వారం క్రితం కూడా ఓ విదేశీ ప్రయాణికుడు అక్రమంగా తెస్తున్న బంగారు ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతను.. రూ.37.91 లక్షలు విలువైన నగలు తరలిస్తున్నాడు. ఇప్పుడు సినీ ఫక్కీలో ప్లాన్ చేశారు స్మగ్లర్లు.