గోల్డ్ స్మగ్లింగ్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. స్మగ్లర్ల్ లు రోజుకో టెక్నాలజీతో కొత్తదారులను వెతుక్కుంటూ కొత్త పుంతలను తొక్కుతున్నారు. ఒకప్పుడు విమాన మార్గాలకే పరిమితమైన స్మగ్లర్ లు.. ఇప్పుడు ఎక్కవగా రద్దీ ఉండే ప్రదేశాలను టార్గెట్ చేసుకుంటూ వారి కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఈక్రమంలో తాజాగా రైల్వేలను ఎంచుకుంటూ వారి కార్యకలాపాలను సాగించాలనుకున్నారు. కాని రెండు గోల్డ్ స్మగ్లింగ్ కేసుల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ వారు పట్టుకున్నారు. ఈనెల 8వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని సిబ్బంది గమనించారు.
అతని బ్యాగ్ లో నుంచి 2.314 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారు 1.32 కోట్లుగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అతను కోల్ కత్తాకు చెందిన స్మగ్లర్ గా గుర్తించి.. అతనిని అరెస్ట్ చేశామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. అయితే మరో కేసులో 7.396 కేజీల బంగారం లభ్యమైందని డీఆర్ఐ అధికారులు తెలిపారు.
ఈ నెల 9వ తేదీన కోల్ కత్తా నుంచి వస్తున్న హౌరా ఎక్స్ ప్రెస్ లో ఏపీలోని శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వచ్చిన వ్యక్తితో పాటు రైల్వే ప్లాట్ ఫారమ్ పై అతడిని కలుసుకున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీని విలువ 4.21 కోట్లు ఉంటుందని అంచనా. అయితే బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారు.