జస్ట్ ఎయిర్ పోర్ట్ లో కష్టమ్స్ అధికారుల కన్నగప్పితే చాలు. కోట్ల విలువ చేసే బంగారం కారుచవుగా సొంతం చేసుకున్నట్టవుతుంది అనుకుంటారు. దానికోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు స్మగ్లర్స్. మోసం అంత తేలిగ్గా ఎలా దాగుతుంది.?!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం కావడం వల్ల ఇక్కడకు విదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ.. కానీ ఇండియాలో గోల్డ్ రేటు ఆకాశాన్ని అంటుతోంది.
అదే బంగారం విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో తక్కువ మొత్తంలో లభ్యమవుతోంది. అందుకే కొంతమంది విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.
తాజాగా మంగళవారం రియాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి 24 గంటలు కాలేదు.. అప్పుడే మరొక వ్యక్తి దుబాయ్ నుంచి వస్తూ 2.19 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.
దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద కస్టమ్స్ అధికారులు 2.19 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.1.81 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిందితుడు ఏపీలోని వైఎస్సాఆర్ జిల్లా వాసిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకొని.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఎమర్జెన్సీ లైట్లో ఉంచి బంగారాన్ని తరలిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
నిజానికి శంషాబాద్ విమానాశ్రయం అక్రమ బంగారం రవాణాకు అడ్డాగా మారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తరచూ ఈ ఎయిర్పోర్టులో అక్రమ బంగారం, డ్రగ్స్, విదేశీ కరెన్సీ పట్టుబడుతూనే ఉంది. అధికారులు అప్రమత్తం కావాల్సి ఉందనే సూచనలు వెల్లువెత్తుతున్నాయి.