చేపల వేటకు వెళ్లిన ఓ మత్య్సకారుడిని అదృష్టం వరించింది.ఓ అరుదైన చేప వలకు చిక్కింది. ఆ చేప రంగు సాధరణ చేపల్లా కాకుండా బంగారు వర్ణంలో ఉండడంతో దాన్ని పట్టుకున్న జాలరి పట్టరాని సంతోషంతో వెనక్కివచ్చాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఉడిపిలోని మల్పే బీచ్‌లో అరుదైన బంగారు రంగు చేప మత్స్యకారుల వలలో పడింది. అజాల్ రకం చేపగా దీనిని గుర్తించారు.ఈ తరహా చేప పొలుసు బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది సుమారు 16 కిలోల బరువు ఉంది. బోటులో చేపల వేటకు వెళ్లిన సందర్భంలో ఈ చేప వలలో చిక్కుకున్నట్లు జాలరి తెలిపాడు.
మల్పే ఓడరేవులో బంగారు రంగు అంజల్ చేప కిలోకు 600 రూపాయలుగా నిర్ణయించారు. అంటే 16 కిలోలకు రూ. 9,600 అన్నమాట. అయితే.. బంగారు చేప దొరికిందన్న సమాచారం అందుకున్న స్థానికులు చేపను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. అంతేకాదు ఆ చేపను దక్కించుకునేందుకు సైతం పోటీ పడ్డారు.
అట్లాంటిక్ సరస్సులలో ఒక ప్రత్యేక ఏంజెల్ ఫిష్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు కర్నాటక మత్స్యకారుల వలలోనే ఈ ప్రత్యేక చేప పడటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.చివరకు..మల్పేకు చెందిన సురేష్ ఈ చేపను రూ.9,600కు కొనుగోలు చేశాడు. ఒక్క చేప అమ్మగా దాదాపు రూ.పదివేలు వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు.
అరేబియా సముద్రానికి చెందిన ఏంజల్ ఫిష్ పేరు కాస్తా ఇండియాకు వచ్చే సరికి అంజల్ ఫిష్ అయిపోయింది. ఈ చేపలకు సహజసిద్ధమైన లక్షణాలు లేదా జన్యుపరంగా బంగారు రంగు వచ్చే అవకాశం ఉందని పరిశోధకురాలు డా.తజ్జా తెలిపారు. కాగా.. ఈ చేప వలకు చిక్కడం, దాన్ని కొనేందుకు పోటీపడటంతో మార్కెట్లో సందడి నెలకొందని జాలర్లు వెల్లడించారు.