భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా .. ప్రధాని మోడీతో కలిసి ‘పానీపూరీ’ తో బాటు . ఫ్రై చేసిన ఇడ్లీలు, స్ధానిక డిష్ లను ఎంతో ఇష్టంగా తిన్నారు. ఢిల్లీ లోని బుధ్ధ జయంతి పార్క్ లో ఇద్దరూ ఓ బెంచ్ పై కూర్చుని మట్టి కప్పుల్లో టీ తాగారు. ఈ అగ్ర నేతల ప్రగాఢ మైత్రి చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. భారత-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ..ఇలాంటి వన్నీ నిన్నటి అంశాలుగానే మిగిలిపోగా.. మంగళవారం వాటి జోలికేమీ వెళ్లకుండా మోడీ, కిషిదా ..ఈ డిష్ ల ప్రాధాన్యం, వీటి పోషకాహార విలువలు వంటివాటిపైనే ముచ్చటించుకున్నారు.
తమకు కేటరర్స్ ఇచ్చిన లస్సీ కూడా వీరి సంభాషణల్లో చోటు చేసుకుంది. పచ్చని పచ్చిక తో కూడిన ఈ పార్క్ లో తాము ఎంత ఆప్యాయంగా మాట్లాడుకున్నదీ మోడీ వివరిస్తూ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మై ఫ్రెండ్ కిషిదా అండ్ ఐ ఎంజాయ్డ్ ఇండియన్ స్నాక్స్ ఇంక్లూడింగ్ గోల్ గప్పాస్’ అని ఆయన సరదాగా ట్వీట్ చేశారు.
జపాన్ ప్రధాని ఇష్టంగా పానీపూరీలను తింటున్న ఉదంతం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ కాగానే అనేకమంది భారతీయులు ఆయన నిరాడంబరతను, ఇండియా పట్ల ఆయనకున్న అభిమానాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
ఈ పార్క్ వివరాల గురించి మోడీ.. కిషిదాకు వివరించారు. 1964 లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దీన్ని ప్రారంభించారని, ‘పవిత్రమైన బోధిమొక్క’ను నాడు ఆయన నాటారని మోడీ వెల్లడించారు. అది నేడు భారీ వృక్షమైందన్నారు. ఈ వృక్షానికి ఉభయ నేతలూ హస్తం జోడించి తమ గౌరవాన్ని చాటారు.