గొంగడి త్రిష.. ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన ఈ 17 ఏళ్ల అమ్మాయి అండర్ – 19 టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో కనబరిచింది. బౌలింగ్ లో, బ్యాటింగ్ లో రాణించి వరల్డ్ కప్ సాధనలో తన వంతు పాత్ర పోషించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఇంగ్లండ్ పై భారత జట్టు విజయభేరి మోగించ్ కప్ సొంతం చేసుకుంది. 67 పరుగుల లక్ష్యం తేలికే అయినా ఓపెనర్లు త్వరగా ఔట్ కావడం, దీనికి తోడు విపరీతమైన ఒత్తిడి మధ్య పిచ్ ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా నిలకడగా ఆడిందీ తెలుగమ్మాయి. తుదికంటా క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది.
దీంతో త్రిష సొంతూరు భద్రాచలంలో క్రీడాభిమానులు ఆనందానికి హద్దే లేదు. గెలిచిన అనంతరం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరిపారు. బాణా సంచా కాల్చుతూ జయహా భారత్ నినాదాలు చేశారు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్ ల్లో 116 పరుగులు చేసింది త్రిష. అందులో స్కాట్లాండ్ పై మెరుపు అర్ధశతకమూ ఉంది. కాగా టీమిండియా ప్రపంచ ఛాంపియన్ గా నిలవడంలో కీ రోల్ పోషించిన త్రిషపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది.
ఇక త్రిష తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా కూతురు క్రికెట్ కోసం ఎంతో పాటుపడిన తండ్రి రామిరెడ్డి తన బిడ్డను చూసి గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. కాగా త్రిష బాల్యం మిగిలిన పిల్లల కంటే చాలా భిన్నంగా గడిచింది. రెండేళ్ల నుంచి ఆమె తండ్రి ఇంట్లో కార్టూన్లు చూడటం నిషేధించారు. కూతురును క్రికెటర్ గా చూడాలనుకున్న ఆయన కేవలం క్రికెట్ మ్యాచ్ లు మాత్రమే చూడాలని బిడ్డను ఆదేశించాడు. ఇక రోజూ తండ్రితో కలిసి జిమ్ కు వెళ్లేదట త్రిష. అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసేదట.
గొంగడి రామిరెడ్డి స్వతహాగా హాకీ క్రీడాకారుడు. అయితే కొన్ని కారణాలతో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న ఆయన కల సాకారం కాలేదు. అందుకే కూతురు రూపంలో తన కలను నెరవేర్చుకోవాలనుకున్నారు. ఇందుకోసం భద్రాచలంలో తన పేరిట ఉన్న జిమ్ ను సగం ధరకు అమ్మాడు. ఇక ట్రైనింగ్ ఖర్చులకోసం భూమిని కూడా అమ్ముకున్నాడు. అయితే ఎప్పుడూ వీటి గురించి బాధపడలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు త్రిష తండ్రి రామిరెడ్డి.