యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో యాదాద్రికి వెళ్లే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి ‘యాదాద్రి దర్శిని’ పేరుతో ప్రత్యేక మినీ బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా బస్సు సర్వీసులను ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ వీసీ సజ్జనార్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ బస్సు సర్వీసుపై సజ్జనార్ మాట్లాడుతూ.. ఉప్పల్ నుంచి ప్రతి రోజూ యాద్రాదికి 104 బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75గా టికెట్ ధరను నిర్ణయించామని వెల్లడించారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. అలాగే, అన్ని జిల్లా కేంద్రాల నుంచి యాదాద్రికి బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
అలాగే, వీఆర్ఎస్‌కు 2 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వీఆర్ఎస్ కోసం ఉద్యోగులను ఎవరినీ బలవంతం చేయడం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగుల వీఆర్ఎస్ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామన్నారు. వీఆర్ఎస్ తేలాక ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు.
Advertisements
అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు ఇవి సెస్ చార్జీలు మాత్రమేనని తెలిపారు. టోల్ ప్లాజా డబ్బులు టిఎస్ ఆర్టీసీ చెల్లిస్తుందన్నారు. ఏటా రూ.70 నుండి 100 కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోతుందని తెలిపారు. ఆర్టీసీ లాభాల కోసమే చార్జీల పెంపు అని స్పష్టం చేశారు. ఇంత చేసినా రోజూ 6 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు. త్వరలోనే కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.