ఇటీవల పాన్ ఇండియా సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్గేస్ట్ ఫిలిం దంగల్, టాలీవుడ్ బిగ్గేస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను దాటేసి బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ మార్క్ ను ఏర్పాటు చేసింది కేజీఎఫ్-2. అయితే.. కేజీఎఫ్ చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మూవీకి త్వరలోనే సీక్వెల్ గా కేజీఎఫ్-3 రాబోతుందని పేర్కొంది.
కేజీఎఫ్-1,కేజీఎఫ్-2 చిత్రాలు సూపర్ హిట్స్ సాధించడంతో.. కేజీఎఫ్-3 ఉంటుందా..? ఉండదా..? అనే దానిపై అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది. అయితే.. ఆ అనుమానాలకు స్పందించిన చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజీఎఫ్-3 సినిమాను 2024లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాత విజయ్ కరంగదుర్ తెలిపారు.
ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సాలార్ మూవీ ఇప్పటికే 35 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందని.. నవంబర్ లోపు ఈ సినిమా పూర్తవుతుందని వెల్లడించారు. ఆ తర్వాత కేజీఎఫ్-3 షూట్ మొదలుపెట్టి.. 2024లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నామని చెప్పారు. మార్వెల్ సిరీస్ లాగా ఓ సరికొత్త రకమైన విశ్వాన్ని సృష్టించబోతున్నామని విజయ్ స్పష్టం చేశారు.
కాగా.. భారీ అంచనాల మధ్య విడుదలైన కేజీఎఫ్-2 చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధ్యం కానీ రీతిలో రికార్డులను నెలకొల్పుతోంది. సరికొత్త రికార్డులను మూటగట్టుకుంటోంది.