పబ్ జీ… పని లేని వాళ్ళు, పనులు ఉన్న వాళ్ళు పనులు మానుకుని, చదువు ఉన్న వాళ్ళు చదువు పక్కన పెట్టి, ఉద్యోగాలు చేసే వాళ్ళు లీవ్ లు పెట్టి ఆడే ఒక ఆట. కొందరికి పనికిమాలిన పని అయితే కొందరికి అదో వ్యసనం. వ్యసనాలు ఎప్పుడూ అంతేలే గాని… భద్రతా కారణాలతో బ్యాన్ చేసిన ఈ గేమ్ మళ్ళీ మన ఇండియాలోకి వస్తుందని అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత పబ్ జీ మొబైల్ ఇండియాలోకి వస్తుంది.
అయితే ఇప్పటికే కేంద్రం దీనికి అనుమతి ఇచ్చేసింది అని టాక్. పబ్ జీ మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్ భారత్ లోకి తిరిగి వచ్చే అంశంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. పబ్ జీ సహా దాని సంబంధిత కంటెంట్ తో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న గాడ్ నిక్సన్, లవ్ శర్మ దీనికి సంబంధించి కీలక విషయం ప్రకటించారు. గాడ్ నిక్సన్ PUBG మొబైల్ ని తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం “గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది” అని చెప్పారు.
రాబోయే రెండు నెలల్లో పబ్ జీ ఇండియాలోకి వచ్చే అవకాశం ఉందని ఇందుకు గానూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఖచ్చితమైన విడుదల తేదీ లేదా నెల ఖరారు కాలేదు. కాని ఇది కచ్చితంగా వస్తుంది అని మాత్రం పక్కాగా చెప్తున్నారు. అయితే దీని మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్‌లో కార్పొరేట్ అభివృద్ధి విభాగాధిపతి సీన్ హ్యూనిల్ సోహ్న్ సహ వ్యవస్థాపకుడు అక్షత్ రథీతో మాట్లాడుతూ… పబ్ జీ మొబైల్ ఇండియాను ఒక సంస్థగా మార్చడానికి కంపెనీ నిజంగా కృషి చేస్తోందని వివరించారు. భారత మార్కెట్ తమకు చాలా ముఖ్యమని ప్రకటించారు.