తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి ఉచిత దర్శనానికి ఉచిత టోకెన్లను జారీ చేయనున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
గతేడాది డిసెంబర్ లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను టీటీడీ నిలిపివేసింది. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
ఈ నెల 16 న సర్వదర్శనం కోసం 15వ తేదీ ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్లలో టోకెన్లకు సంప్రదించాలని సూచించారు.
కాగా.. ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రోజు వారీ కేసులు వెయ్యిలోపే నమోదవుతున్నాయి. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.