టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కొత్త ఆవిష్కరణలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టులను గూగుల్ వేగవంతం చేసింది. గూగుల్ ఐ/ఓ 2022 పేరుతో నిర్వహించే ఈవెంట్‌లో తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈవెంట్‌కు సంబంధించిన తేదీలను ఇప్పటికే ఖరారు చేసింది. మే 11, 12 తేదీల్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది గూగుల్.
గూగుల్ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్‌డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ స్మార్ట్ వాచ్‌ను యూజర్ల ముందుకు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వేర్ ఓఎస్ 3.1 వెర్షన్‌తో పిక్సెల్ స్మార్ట్ వాచ్ అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ తుది సన్నాహాలు చేస్తోంది.
ఇక, ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌ను కూడా గూగుల్ ఆవిష్కరించనుంది. గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ విడుదల చేయగా.. ఇటీవల మరో కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను గూగుల్ విడుదల చేయనుంది. అయితే, దీన్ని పిక్సెల్ ఫోన్‌లో మాత్రమే అందుబాటులోకి తేనుంది. త్వరలోనే అన్ని ఫోన్లలో ఇది రంగప్రవేశం చేయనుంది. యూజర్ల కోసం పలు కొత్త అప్‌డేట్‌లతో ఈ వెర్షన్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఓఎస్ మాత్రమే కాదు, కొత్త ఓఎస్‌తో ముస్తాబైన సరికొత్త ఫోన్ ను కూడా గూగుల్ తన పోర్ట్ ఫోలియోలో చేర్చుతోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. కొత్త ఓఎస్‌తో వస్తుంది కాబట్టి దీనికి గిరాకీ బాగానే ఉండొచ్చని గూగుల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ఫ్రంట్ లో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు.
Advertisements
‘పిక్సెల్ మోడల్స్‌లో అత్యంత వేగంగా అమ్ముడయ్యే ఫోన్లలో ఒకటిగా ఈ ఫోన్ నిలుస్తోంది. దీన్ని విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఫోన్ గురించి మరిన్ని విషయాలు గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో పంచుకుంటాం’ అని గతంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. అయితే, గూగుల్ పిక్సెల్ 6ఏ పేరును గూగుల్ ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే ఉన్న మోడల్ పిక్సెల్ 5ఏ కాబట్టి, తర్వాత వచ్చే మోడల్ 6ఏ అయ్యుంటుందని నిపుణులు అంచనా వేశారు.