ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని ఎగతాళి చేస్తూ కమెడియన్ పోస్టు చేసిన వీడియో గూగుల్ మెడకు చుట్టుకుంది. యూట్యూబ్ లో ఆ వీడియో పోస్టు చేసిన కారణంగా రూ.4 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. ఆసీస్ పొలిటీషియన్ జాన్ బరిలారో.. న్యూసౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్ గా ఉన్న సమయంలో.. 2020లో అతన్ని విమర్శిస్తున్న ఒక వీడియో యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది.
జోర్డాన్ షాంక్స్ అనే వ్యక్తి ఈ వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోలో బరిలారో ఒక పెద్ద అవినీతి పరుడంటూ.. ఇటాలియన్ యాసలో మాట్లాడుతూ బరిలారోను ఎగతాళి చేశాడు. సదరు రాజకీయ నేత పూర్వీకులు ఇటలీ వాళ్లు కావడంతో ఈ ఘటన రాజకీయాల్లో దుమారం రేపింది.
దీనిపై కోర్టెకెక్కిన బరిలారో.. ఈ వీడియోల వల్ల తను చాలా వేదనకు గురైనట్లు పేర్కొన్నాడు. 2021లో తను తప్పు చేసినట్లు అంగీకరించిన షాంక్స్.. బహిరంగ క్షమాపణ చెప్పడంతోపాటు.. ఆ వీడియోలను ఎడిట్ చేస్తానని చెప్పాడు. కానీ.. అప్పటికే వాటికి పది లక్షలపైగా వ్యూస్ వచ్చాయి. ఈ కేసులో షాంక్స్ తరఫున వాదించేందుకు ప్రయత్నించిన యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్.. మధ్యలోనే వెనుతిరిగింది.
ఈ వీడియోలను తొలగించాలని బరిలారో లాయర్.. లేఖలు రాసినప్పటికీ గూగుల్ స్పందించలేదు. దాన్ని ఎత్తిచూపుతూ.. న్యాయమూర్తి తాజా తీర్పులో గూగుల్ ను తప్పుబట్టారు. ఇదిలా ఉంటే.. ఆ వీడియోలు విడుదలైన తర్వాత బరిలారో తన టర్మ్ పూర్తవకుండానే పదవికి రాజీనామా చేశారు. అలాగే తను అంతులేని ఆవేదనకు గురైనట్లు పలుమార్లు చెప్పారు. దీంతో ఈ కేసులో గూగుల్ ది కూడా తప్పు ఉందన్న కోర్టు.. బరిలారోకు 5.15 లక్షల డాలర్లు (రూ.4 కోట్లపైగా) నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.