అమరావతి: గ్రామ సచివాలయాల జాబ్స్ టెస్ట్ మెరిట్ లిస్టు ట్వీట్ల ట్విస్టులకు దారితీస్తోంది. చివరి దశలో ర్యాంకులు మారిపోతున్నాయని ఆందోళనల ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్లకు జిల్లాల వారీగా పోస్టుల వారీగా, కేటగిరీ, సబ్ కేటగిరీల వారీగా అర్హత జాబితాలు తయారు చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్‌లో ప్రకటించారు.
వెంటనే అభ్యర్థుల నుంచి ఆయనకు ప్రతి ట్వీట్ల రూపంలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. త్రివిక్రమ్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు లేవని ఒక అభ్యర్థి ట్వీట్లో అసహనం. మెరిట్ లిస్టు పెట్టకపోతే పెద్ద స్కాం చేస్తున్నట్లే లెక్క మరొక ట్వీట్. ఫైనల్ కీ ఇచ్చే వరకు చాలా వేగంగా జరిగిన ప్రక్రియ ఇప్పుడెందుకు ఇంత వెనుకబడిందో అర్థం కావడం లేదని మరో ట్వీట్లో అనుమానం.
అవినీతి స్థాయి పెరిగేకొద్ది ర్యాంకులు పెరుగుతున్నాయా? బాగా అమ్ముకుంటున్నారా? అంటూ మరో అభ్యర్థి ట్వీట్లో ఆవేదన. కేటగిరి-1 ర్యాంకులు ఉన్నపళంగా ఎందుకు మారిపోయాయని వినయ్‌కుమార్ అనే అభ్యర్థి ప్రశ్నించారు. అభ్యర్థి పేరు, హాల్‌టికెట్, ర్యాంకు, మార్కులు సూచిస్తూ ఎంపిక జాబితా పెట్టాలని పవన్‌కుమార్ అనే అభ్యర్థితో పాటు పలువురు అభ్యర్థులు ట్విట్టర్‌లో అభ్యర్థించారు. కటాఫ్ మార్కులు ఇచ్చి తమను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు కోరారు. ఓఎంఆర్ కరెక్షన్ సరిగా లేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మరికొంత మంది అభ్యర్థులు వాపోయారు. ఒకసారి వచ్చిన ర్యాంకు మళ్లీ ఎందుకు మారిందంటూ మరి కొందరు ప్రశ్నించారు.