పక్కా కమర్షియల్.. గోపీచంద్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపెట్టాడు గోపీచంద్. తొలిసారి మారుతి, తనను కలిసినప్పుడు నెరేషన్ ఏమిచ్చాడో, దానికి ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా యాజిటీజ్ తీశాడని చెబుతున్నాడు.
“మారుతి సినిమాలు గతంలోనే చూశాను. ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. మారుతి మొదట స్టోరీ చెప్పినప్పుడే 3 గంటలు చెప్పాడు. ఫుల్ స్క్రిప్ట్ వివరించాడు. అప్పుడే మనసులో చాలా నవ్వుకున్నాను. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత మరింత బాగా ఎంజాయ్ చేశాను. అప్పుడు నాకు 3 గంటల్లో చెప్పిన స్క్రిప్ట్ ను యాజిటీజ్ తీశాడు” అని తెలిపాడు.
గోపీచంద్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను రాసుకున్నాడట మారుతి. ఇదేదో ప్రచారం కోసం చెప్పిన డైలాగ్ కాదంటున్నాడు గోపీచంద్. సినిమా చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమౌతుందని చెబుతున్నాడు.
“కేవలం నన్ను దృష్టిలో పెట్టుకొని మారుతి రాసిన కథ ఇది. ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పడం లేదు. ఇంతకుముందు మారుతి సినిమాల్లో యాక్షన్ తక్కువ. పక్కా కమర్షియల్ లో మాత్రం యాక్షన్ పార్ట్ కాస్త పెంచాడు. ఎందుకంటే తన మార్క్ తో పాటు నా మార్క్ కూడా మిస్సవ్వకూడదు కదా. అందుకే సినిమాలో మారుతి మార్క్ కామెడీతో పాటు నా మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది” అని చెప్పాడు.
ఈ సినిమా కోసం టికెట్ రేట్లు తగ్గించారు. కాబట్టి కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు గోపీచంద్. ఈ చిత్రం విషయంలో తను కమర్షియల్ గా లేనని, ప్రమోషన్లు కూడా పెంచానని తెలిపాడు.