ఈ కాలం సినిమా తీయడం ఒకెత్తయితే, దాన్ని అనుకున్న టైమ్ లో రిలీజ్ చేయడం మరో ఎత్తు. అంతా కరోనా మహత్యం. కరోనా దెబ్బకు థియేట్రికల్ వ్యవస్థ ఇలా మారిపోయింది. ఈ ప్రభావం మరో ఏడాది ఉండేలా ఉంది. ఇప్పుడిదంతా ఎందుకంటే, పక్కా ప్లానింగ్ తో సినిమాలు తీసే దర్శకుడు మారుతి కూడా ఇప్పుడు కరోనా దెబ్బకు తలవంచాల్సి వచ్చింది. తన సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

కరోనా వల్ల పెద్ద సినిమాలన్నీ ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడా సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్లలోకి వస్తున్నాయి. అలా జూన్ చివరి వారం వరకు మరో సినిమాకు గ్యాప్ లేదు. ఆర్ఆర్ఆర్ నుంచి సర్కారువారి పాట వరకు అన్ని సినిమాలు క్యూ కట్టాయి. సో.. మీడియం రేంజ్ సినిమాలు రావాలంటే జులై వరకు ఆగాల్సిందే. అందుకే గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ ను కూడా జులై కు వాయిదా వేశారు. లేదంటే ఏప్రిల్ లో రావాల్సిన సినిమా ఇది.
పక్కా కమర్షియల్ లో మరోసారి గోపీచంద్, రాశిఖన్నా కలిసి నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.