చాలా రోజుల నుంచి ఓ బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. గతేడాది ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా లాభం లేకపోయింది. తాజాగా ఇప్పుడు గోపీచంద్ ‘రామబాణం’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ ది హిట్ కాంబినేషన్. ఇద్దరి కాంబోలో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలు మంచి విజయం సాధించాయి.
ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే వస్తున్న మరో చిత్రం ‘రామబాణం’. టైటిల్ చివరన సున్నా వచ్చే సెంటిమెంట్ ను ఈ చిత్రంలోనూ కొనసాగించారు. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా గోపీచంద్ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు.
‘విక్కీ మొదటి బాణం’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో గోపీచంద్ తన మార్కు యాక్షన్ సీన్స్ లో కనిపించారు. రామబాణంలా దూసుకుపోయే స్వభావమని తెలిపేలా చేతికి బాణం లాకెట్ ధరించి అదిరిపోయే ఫైట్ తో గోపీచంద్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన కెరీర్‌లో ఇది 30వ చిత్రం కావడం విశేషం.
దీంతో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉండేలా చూస్తున్నారు దర్శకుడు శ్రీవాస్. ఈ సినిమాకు భూపతి రాజా కథను అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు.