ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేంద్ర సంస్థల దర్యాప్తు కొనసాగుతోంది. ఈమధ్యే అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు కోర్టు తాజాగా కస్టడీ పొడిగించింది. శనివారంతో ఇంతకుముందు విధించిన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు అతన్ని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు.
బుచ్చిబాబు కస్టడీ పొడిగించాలని అధికారులు కోర్టుకు తెలపగా.. అందుకు అంగీకరించింది న్యాయస్థానం. మరో 14 రోజుల కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ నుంచి అభిషేక్ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే. ఇతనికి ప్రముఖులతో పరిచయాలు ఉండడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఉంది.
ఈనెల 8న విచారణ పేరుతో బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించుకుంది సీబీఐ. అదేరోజు రాత్రి అదుపులోకి తీసుకుంది. గతంలో సీబీఐ, ఈడీ బుచ్చిబాబును ప్రశ్నించాయి. ఢిల్లీ ఎక్సైజ్ విధానం, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని అనుమానాలున్నాయి. హైదరాబాద్ కు చెందిన హోల్ సేల్, రిటైల్ లైసెన్సీలకు, వారి ద్వారా ప్రయోజనం పొంది.. అక్రమ లాభాలు సమకూరాయని సీబీఐ అంటోంది.
2021 జూన్ లో బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లైతో కలిసి ఢిల్లీలో విజయగౌరి అపార్ట్‌మెంట్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్ తో చర్చలు జరిపారని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఐటీసీ కోహినూర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, తాజ్ మన్ సింగ్ హోటల్, ఒబెరాయ్ హోటల్ తదితర ప్రాంతాల్లో కూడా కీలక సమావేశాలు జరిగాయని తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు 9 మంది అరెస్ట్ అయ్యారు.