ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని ఆయన రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు లేఖ రాశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖ రాశారు. ఇప్పటి వరకూ తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ లిస్ట్ ను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.
తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన ఒక మొబైల్ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతిరోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.మరోవైపు.. ఈ మధ్యే ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ టైర్ ఊడిపోయింది. రాజాసింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా ధూల్ పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది.
స్పీడ్ తక్కువగా ఉండటంతో ఎవరికీ ఏమీ కాలేదు. ఇప్పటికే చాలాసార్లు రాజాసింగ్ వెహికిల్ నడిరోడ్డుపై ఆగిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజాసింగ్ చాలాసార్లు ఆరోపించారు.