టైటిల్‌లో కన్ఫ్యూజన్ ఏం లేదు. 100 శాతం నిజమే. అయితే ఈ మాట నేరుగా అనలేక, అనే ధైర్యం లేక గాంధీభవన్‌లో కొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో పరోక్షంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఉన్నారని మట్లాడుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నంలో గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావుని ముందుపెట్టి టీడీపీకి ఉనికి లేకుండా చేసిన కేసీఆర్.. ఇక ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ అదే ప్లాన్‌ను రెడీ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం పీసీసీ రేస్‌లో ఉండి.. తరచూ తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసే ఓ నేత చేతికి ఎలాగైనా కాంగ్రెస్ పగ్గాలు దక్కేలా.. తెరవెనుక కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వారు అంటున్నారు. పీసీసీ చీఫ్‌గా దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు ఖరారై ప్రకటన వస్తున్న సమయంలో.. కేసీఆర్ వేసిన పాచిక కారణంగానే ఇప్పుడు కొత్తగా అభిప్రాయ సేకరణ అంశం తెరపైకి వచ్చినట్టుగా ఆ నేతలు చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో ఉన్న తన కోవర్టులను కేసీఆర్ ఇప్పటికే అలర్ట్ చేసి.. ఆ నేతకు అనుకూలంగా మాట్లాడేలా ఓ ఢీల్ కూడా సెట్ చేశారంటూ చెవులు కొరుక్కంటున్నారు. అందుకే.. ఒకనొక సమయంలో పార్టీ మారతానని చెప్పిన సదరు పీసీసీ రేస్ గుర్రం ఇప్పుడు… కేసీఆర్ ఇచ్చిన బలంతో ఫక్తు కాంగ్రెస్ వారియర్‌గా మారిపోయాడని వారంటున్నారు. ఇప్పుడా నేత చేతికి కాంగ్రెస్ పగ్గాలు దక్కితే… నాడు టీడీఎల్పీ నేతగా ఉండి ఎర్రబెల్లి నడిపిన ఎపిసోడ్ మళ్లీ రిపీట్ అవుతుందని ఆఫ్ ది రికార్డ్ తెగ ముచ్చట్లాడుకుంటున్నారు.