శ్రీరామ నవమి వచ్చిందంటే భద్రాచలం రామ నామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ ఏడాది మార్చి 30న శ్రీరామ నవమి జరగనుంది. అయితే సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిని తయారు చేయడం దగ్గర నుంచి భద్రాద్రి చేరుకునే వరకు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలు చూపిస్తారు. ఈ ఏడాది కూడా భద్రాద్రి శ్రీ సీతారామ కళ్యాణం గోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పది గ్రామాల భక్తులు కలిసి స్వామివారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ ఆథ్యాత్మిక సమితి జంగారెడ్డి గూడెం నుంచి 20 ఏళ్లుగా ప్రతిఏటా కోదండరాముని కళ్యాణానికి గోటితో వొలిచిన తలంబ్రాలను భక్తులంతా కలిసి పాదయాత్రగా భద్రాద్రి వెళ్లి సమర్పిస్తారు. ఈ ఏడాది 300 కేజీలు గోటితో వొలిచిన తలంబ్రాలు సిద్ధం చేశారు. ఈ యాత్ర పొడవునా భక్తులు పోటీపడి మరీ వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లోని 100 గ్రామాల నుంచి 10 వేల మందికి పైగా భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. మార్చి 26న ప్రారంభమై 29వ తేదీ మధ్యాహ్నానికి భద్రాద్రికి చేరుకుంటుంది. అనంతరం స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఆయా గ్రామాల్లోని భక్తులందరికీ పంచుతారు.
ఈ పాదయాత్రను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు తపన చౌదరి, నిర్వాహకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. గోటి తలంబ్రాలతో రామదండు భద్రాద్రికి పయనమైంది. భక్తులు ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసుకొని క్షేమంగా తిరిగిరావాలని శ్రీరామ ఆథ్యాత్మిక సమితి సభ్యులు ఆకాంక్షించారు.