కుల వివక్షతో వేధిస్తున్న ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పీడీఎస్ యూ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామ సమీపంలో గల మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ గాయత్రి వేధింపులకు గురి చేస్తుందంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. కుల వివక్షతతో దూషిస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ప్రిన్సిపాల్ గాయత్రి మరికొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్ గాయత్రిని వెంటనే సస్పెండ్ చేసి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ యూ, కేవీపీఎస్ నాయకులతో కలసి విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పీడీఎస్ యూ ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి, కేవీపీఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, వారి పట్ల కుల వివక్షతో వ్యవహరిస్తూ, వేధింపులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్న గోట్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రిని సస్పెండ్ చేయాలని కోరారు.