బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై యూపీ రాజధాని లక్నోలో కేసు నమోదైంది. ప్లాట్ విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో తనకు ఫ్లాట్ కేటాయించారని ముంబైకి చెందిన జశ్వంత్ షా తెలిపారు. దాని కోసం రూ. 86 లక్షలు చెల్లించినట్టు ఆయన పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆ ఫ్లాట్ ను కంపెనీ యాజమాన్యం వేరొకరికి ఇచ్చిందన్నారు.
ఈ క్రమంలో తులిసియానీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సీఎండీ అనిల్ కుమార్, డైరెక్టర్ మహేశ్ తులసియానీలపై ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీకి గౌరీ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆమె ప్రభావంతోనే తాను కంపెనీ దగ్గర ఫ్లాట్ కొన్నానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో గౌరీపై ఐపీసీలోని నాన్ బెయిలబుల్ సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షారుఖ్ ఖాన్ భార్య ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కత్రినా కైఫ్ నుంచి మలైక అరోరా వరకు పలువురు ప్రముఖ హీరోయిన్ల కు ఇంటీరియర్ డిజైనింగ్ సేవలు అందించారు.