తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారతదేశం జరుపుకునే అతిపెద్ద ప్రజాస్వామ్య పండగని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాతలకు నివాళి అర్పించారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ పై తమిళిసై ప్రశంసల వర్షం కురిపించారు.
మహమ్మారి సమయంలో వారు అందించిన సేవలను గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంత విజయవంతం కావడానికి వారే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ కోవిడ్ విషయంలో అప్రమత్తంగా అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనలు పాటించాలని సూచించారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని.. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీనికి ప్రతిజ్ఞ చేద్దామని గవర్నర్ తమిళిసై అన్నారు.
అటు.. సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల హక్కులకు రక్షణ ఉన్నపుడు భారత ప్రజాస్వామ్యం మరింత బలంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. ప్రజలే పాలకులను నిర్దేశించేలా ఉండటం మన దేశ రాజ్యాంగం గొప్ప లక్షణమని అన్నారు.
భిన్నసంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశం గొప్పతనమని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా అవతరించినప్పటికీ.. రాజ్యాంగంలో ఉన్న సమాఖ్యస్ఫూర్తిని అనుసరిస్తుందని చెప్పారు. రాజకీయాలకు పరిపాలనను దూరం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు.