హైదరాబాద్ :తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నేత తమిళిసై సౌందరాజన్ నియమితులయ్యారు. ఐదు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తన్నను నియమించింది. ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేసి దత్తాత్రేయ విజయం సాధించారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా దత్తాత్రేయకు బాధ్యతలు అప్పగించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దత్తాత్రేయకు రాలేదు. అయితే దత్తాత్రేయ సీనియర్ నేత కావడం.. పార్టీలో చురుకుగా పనిచేస్తుండడంతో ఆయనకు పార్టీ అధిష్టానం గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించినట్టు తెలుస్తోంది.
ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో గవర్నర్‌గా ఉన్న కల్రాజ్ మిశ్రాకు రాజస్థాన్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రకు భగత్‌సింగ్ కోశ్యారీ, కేరళకు అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను నియమించారు.