దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్రం అత్యవసరంగా నిషేధం విధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వేసవిలో నాటిన ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కోత ఆలస్యమైంది. ఫలితంగా నెలరోజుల వ్యవధిలోనే ఉల్లి రేటు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఉల్లి ధర.. రూ.30 నుంచి రూ. 40 మధ్య పలుకుతోంది. కాగా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియాతో పాటు పలు దేశాలు ఉల్లికోసం ఇండియాపైనే ఆధారపడతాయి.