బంజారాహిల్స్ డ్రగ్స్ కేసుపై ఎట్టకేలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఘటన జరిగిన వెంటనే కీలక ఆదేశాలు జారీ చేశానంటూ ఆయన తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. పబ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆదేశించానన్నారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఆదేశాల మేరకు పబ్ యజమానులతో జనవరి 31న హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా యజమానులే బాధ్యత వహించాలని ఆ సమావేశంలో హెచ్చరించాని చెప్పారు. డ్రగ్స్ వినియోగం పై పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే వారి లైసెన్స్ ను రద్దు చేస్తామన్నారు. నిబంధనలు పాటించకపోతే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు మంత్రి. తాజా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
డ్రగ్స్ నిర్ములనలో భాగంగా ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారన్నారు. నిబంధనలు పాటించని అన్ని పబ్ లు, బార్స్ లపై నిరంతరం దాడులను కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను కేసీఆర్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. అందులో భాగంగానే డ్రగ్స్ తో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖను బలోపేతం చేశామన్నారు శ్రీనివాస్ గౌడ్. అందులో భాగంగా అధికారులకు ప్రమోషన్లతో పాటు పోస్టింగ్స్ ను ఇటీవల ఇచ్చామని చెప్పారు. ఆబ్కారీ శాఖ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కంటిన్యూగా పబ్స్, బార్లపై నిఘా పెట్టి ఎవరైతే నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.