ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితను అరెస్ట్ చేస్తే వరంగల్ భగ్గుమంటుందని హెచ్చరించారు. కవితను ఇబ్బందిపెడితే దేశ ప్రజలు తిరగబడతారన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను ఈడీతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జేబుసంస్థలను ఉసిగొల్పుతున్నారని వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలవికాస లాంటి స్వచ్ఛంద సంస్థలపై కూడా రైడ్స్ చేయించటం బాధాకరమన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయని విమర్శలు గుప్పించారు. దేశ సంపదను దోచుకుంటున్న అంబానీ, అదానీలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయాలన్నారు.
రైతు సమస్యలపై ఉద్యమం చేస్తుంటే.. రైతులను ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఈనెల 23న హనుమకొండలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు వెల్లడించారు వినయ్ భాస్కర్.